Chandrababu Raa Kadalira Public Meeting: రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.5కే కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని, రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
అమలాపురంలోని 7 సీట్లలోనూ గెలుస్తున్నాం:అమలాపురంలోని 7 సీట్లలోనూ టీడీపీ - జనసేన గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా పచ్చని అందాలకు పెట్టింది పేరని, అతిథి మర్యాదలకు మారుపేరు అన్నారు. మంచినీరు అడిగితే కొబ్బరినీరు ఇచ్చే ప్రాంతం కోనసీమ అని పేర్కొన్నారు. ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇక్కడివారే అని చంద్రబాబు గుర్తు చేశారు. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్ దొరను ఇప్పటికీ పూజిస్తారన్న చంద్రబాబు, తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులకు మంచిపేరు ఉందని తేలిపారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారు:వైసీపీ ప్రభుత్వంలో రైతుల నుంచి ధాన్యం కొనరని, గిట్టుబాటు ధర ఇవ్వరని చంద్రబాబు మండిపడ్డారు. కాలవలు బాగు చేయకుండా పంటలను ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేసుంటే జిల్లాకు సాగునీరు అందేదన్న చంద్రబాబు, టీడీపీ పాలనలో ఆక్వా రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారని విమర్శించారు. అనేక హామీలచ్చి ఆక్వా రైతులను జగన్ మోసం చేశారన్నారు.
టీడీపీ ప్రపంచానికి అరకు కాఫీని ప్రమోట్ చేస్తే - వైఎస్సార్సీపీ గంజాయిని చేస్తోంది: చంద్రబాబు
వంద సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం కోత పెట్టింది: టీడీపీ హయాంలో తెచ్చిన వంద సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం కోత పెట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారన్న చంద్రబాబు, మందుబాబుల బలహీనత జగన్‌కు అర్థమైందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మద్య నిషేధం అని చెప్పి జగన్ మోసం చేశారని అన్నారు. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాం అన్నారని, జగన్ వచ్చాక రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. బీసీలకు సబ్ ప్లాన్ తెస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కోడికత్తి డ్రామా ఆడి ఎన్నికల్లో సానుభూతి తెచ్చుకున్నారు: దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తమదేనని తెలిపారు. దళితుల జీవితాల్లో మార్పు కోసమే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశామని, నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఎన్టీఆర్ ఉన్నప్పడే అంబేడ్కర్‌కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా పంపామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విదేశీవిద్య పథకంలో అంబేడ్కర్ పేరు తీసేసిందని విమర్శించారు. నాలుగున్నర ఏళ్లలో ఆరువేల మంది ఎస్సీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. కోడికత్తి డ్రామా ఆడి ఎన్నికల్లో సానుభూతి తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు.