Chandigarh Mayor Resign : చండీగఢ్ మేయర్, బీజేపీ నేత మనోజ్ సోంకర్ తన పదవికి రాజీనామా చేశారు. సోంకర్ తన రాజీనామా పత్రాన్ని మున్నిపల్ కమిషనర్‌కు సమర్పించినట్లు బీజేపీ వెల్లడించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న కేసు సోమవారం సుప్రీంకోర్టు విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. మరోవైపు, మేయర్ రాజీనామా చేసిన రోజే ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కొత్తగా బీజేపీలోకి మారిన వారితో కలిపితే బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరింది. ఆప్‌నకు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్ ఉన్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సొంకర్, ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు. ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు.