Centre Blocks 18 OTT Platforms :అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ మేరకు 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సామాజిక మాధ్యమ ఖాతాలు భారత్‌లో పనిచేయకుండా బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది. బ్లాక్ చేసిన యాప్‌ల్లో ఏడు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, మూడు యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
అనేక సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీలతను వ్యాప్తి చేయరాదని ఆయన స్పష్టం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, మీడియాకు చెందిన నిపుణులు,మహిళలు, బాలల హక్కుల సంస్థలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్లు చెప్పింది.