CBSE Class 10 Board Exams :కేంద్రం నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను ఏడాదిలో 2 సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ ఓ పబ్లిక్ నోటీస్‌ను తన అధికారికవెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఫిబ్రవరి - మార్చిలో మొదటి విడత పరీక్షలు; మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. ఈ రెండు పరీక్షలూ పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంది.
ఇకపై ఏటా 2సార్లు CBSE పదో తరగతి పరీక్షలు- మరి ప్రాక్టికల్స్ మాటేమిటి? - CBSE CLASS 10 BOARD EXAMS
ఫిబ్రవరి 17-మార్చి 6 వరకు మొదటి విడత- మే5-మే20 వరకు రెండో విడత సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు- ముసాయిదాలోని కీలక అంశాలు ఇవే!

Published : Feb 25, 2025, 10:13 PM IST
ప్రాక్టికల్స్ మాటేమిటి?
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ, ప్రాక్టికల్స్/ అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒకేసారి చేయనున్నట్లు తెలిపింది. ఈ తరహా విధానం విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకొనే అవకాశం కల్పిస్తుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సీబీఎస్‌ఈ వెల్లడించింది. విస్తృతమైన చర్చల అనంతరం రూపొందించిన ఈ ముసాయిదాను తమ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది. ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని బోర్డు సూచించింది.
ఈ విధంగా తమకు వచ్చిన స్పందనలను పరిశీలించిన తర్వాత, ఈ ముసాయిదాను సమీక్షించి, సవరిస్తామని, తరువాత తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం, 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ముసాయిదా డేట్ షీట్స్‌ను సైతం విడుదల చేసింది సీబీఎస్‌ఈ.