CBI Allegations On Sandip Ghosh : కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచారం కేసును, ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది. లైడిటెక్టర్ టెస్టు, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు సందీప్ ఘోష్ మోసపూరితంగా సమాధానం ఇచ్చినట్లు తాము గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. హత్యాచార కేసులో సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు యత్నించారనే ఆరోపణలతో సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హత్యాచార కేసుతో పాటు ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది.
'మోసపూరిత సమాచారం'
సందీప్ ఘోష్‌కు నిర్వహించిన పాలిగ్రాఫ్ టెస్టు, లేయర్డ్ అనాలసిస్ పరీక్షల్లో హత్యాచార కేసుకు సంబంధించిన కీలక ప్రశ్నలకు అతను మోసపూరితంగా సమాధారం ఇచ్చినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) రిపోర్టు ఇచ్చింది. పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో సందీప్ ఘోష్ వెల్లడించిన సమాచారాన్ని కోర్టులు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవు. అయితే కోర్టులో సమర్పించే సాక్ష్యాలను ధ్రువీకరించుకోవడానికి సీబీఐకి ఇవి ఉపయోగపడతాయి. అనుమానితులు, సాక్షుల వాంగ్మూలాలలో దోషాలను అంచనా వేయడానికి పాలిగ్రాఫ్ పరీక్ష సహాయపడుతుంది. పాలిగ్రాఫ్ పరీక్షలో ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు నిందితులు లేదా సాక్ష్యుల మానసిక స్పందనలు, హృదయ స్పందన రేటు, శ్వాస విధానం, చెమటలు, రక్తపోటును పర్యవేక్షించడం ద్వారా, పరిశోధకులు వారి ప్రతిస్పందనలలో వ్యత్యాసాలు ఉన్నాయో లేదో గుర్తిస్తారు.
ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటల 58 నిమిషాలకు వైద్యురాలిపై హత్యాచారం జరిగిందన్న సమాచారం సందీప్ ఘోష్‌కు చేరింది. అయితే, ఘోష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ ఆరోపిస్తోంది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైద్యురాలి మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే కొత్త వాదన తెరపైకి తెచ్చారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. వైద్యురాలిది అసహజ మరణమని ఆగస్టు 9న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ రోజు ఉదయం 10 గంటల 3 నిమిషాలకు తాల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మోండల్‌తో, మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాలకు అడ్వకేట్‌తో సందీప్ ఘోష్ టచ్‌లో ఉన్నట్ల సీబీఐ ఆరోపిస్తోంది. సమాచారం అందినా, వెంటనే ఘటనాస్థలికి చేరుకోకుండా గంట ఆలస్యంగా వెళ్లిన అభిజిత్ మోండల్‌ను సైతం సీబీఐ అరెస్టు చేసింది.