Calling Wife Bhoot Pishach Is Not Cruelty : భార్యను దెయ్యం, భూతం, పిశాచి అని భర్త పిలవడం క్రూరత్వం కింద రాదని పట్నా హైకోర్టు స్పష్టం చేసింది. తన నుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు వెలువరించిన ఓ తీర్పును సవాల్ చేస్తూ ఆమె మాజీ భర్త, మామ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పట్నా హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. దంపతులు విడిపోయినప్పుడు పరస్పరం దుర్భాషలాడుకోవటం మామూలేనని న్యాయమూర్తి జస్టిస్ బిబేక్ చౌధరి వ్యాఖ్యానించారు. ఈ మేరకు దిగువ కోర్టులు వెలువరించిన తీర్పును కొట్టేశారు.
అసలు కేసు ఇదీ!
బిహార్‌లోని నవాదాకు చెందిన మహిళకు 1993లో ఝార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌గుప్తాతో వివాహమైంది. అయితే అదనపు కట్నం కింద కారు డిమాండ్ చేస్తూ తనను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె 1994లో తన భర్తతోపాటు మామ సహదేవ్ గుప్తాపై స్వస్థలంలో కేసు నమోదు చేశారు. తండ్రీకొడుకుల అభ్యర్థనపై ఈ కేసు నలందకు బదిలీ అయ్యింది. 2008లో కోర్టు ఇద్దరికీ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు అదనపు సెషన్స్ కోర్టుకు వెళ్లగా పదేళ్ల తర్వాత అప్పీల్ తిరస్కరణకు గురైంది. దీన్ని సవాల్ చేస్తూ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఆ జంటకు ఝార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.