Calcutta High Court Judge Resign :కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తిగా తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించేందుకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నిరాకరించారు. బంగాల్‌లో విద్యకు సంబంధించి ఇటీవల ఆయన ఇచ్చిన తీర్పులు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
'మార్చి 5న రాజీనామా చేస్తున్నా. న్యాయమూర్తిగా సోమవారం నా ఆఖరి రోజు. నేను ఏ తీర్పూ చెప్పను' అని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ పేర్కొన్నారు. బంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామక ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై విచారణ జరిపేందుకు CBI, ఈడీలను ఆదేశిస్తూ ఇటీవల ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలతో సమాజంలోని విభిన్న వర్గాల నుంచి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులకు అసంతృప్తిని కలిగించినట్లు వార్తలు వచ్చాయి.
వ్యక్తిగత కారణాలతో గత వారం రోజులుగా సెలవులో ఉన్న జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తన రాజీనామాను రాష్ట్రపతికి అందిస్తానన్నారు. అనంతరం మీడియా సందేహాలకు సమాధానం ఇస్తానని తెలిపారు. జస్టిస్ గంగోపాధ్యాయ 2018 మే 2న కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020 జులైలో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయాల్సిన ఉన్న న్యాయమూర్తి ఆకస్మిక ప్రకటనపై రాజకీయ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.