Bullet Women Rajalakshmi Campaign For Modi :నరేంద్ర మోదీని వరుసగా మూడోసారి ప్రధానిగా చేయాలనే లక్ష్యంతో 'బుల్లెట్ రాణి'గా పేరుగాంచిన రాజలక్ష్మి తన 65 రోజుల పర్యటన సందర్భంగా బీహార్లోని సమస్తిపుర్కు చేరుకున్నారు. ఆమెకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీకి ఓటు వేసి మోదీని ప్రధాని చేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. తమిళనాడులోని మధురై నుంచి ఈ యాత్రను చేపట్టిన రాజలక్ష్మీ మందా మాట్లాడుతూ 'నరేంద్ర మోదీ లాంటి దేశభక్తి గల నేతను మరోసారి ఎన్నుకోవాలని దేశం భావిస్తుంది. అందులో భాగంగా నేను కూడా ప్రజల్లోకి వెళ్లి మోదీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను' అని తెలిపారు.
మోదీకే ఓటు వేయండి!
బుల్లెట్ క్వీన్ రాజలక్ష్మి మంద దేశవ్యాప్తంగా తిరుగుతూ 'మోదీకి ఓటు వేయండి' అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ యాత్ర ద్వారా బలమైన, సమర్థమైన భారతదేశాన్ని తయారు చేయాలని, మంచి దేశభక్తి కలిగిన మోదీని మూడోసారి ప్రధానిని చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
65 రోజుల్లో 21వేల కి.మీల ప్రయాణం
రాజలక్ష్మి మంద ఫిబ్రవరి 12న తమిళనాడులోని మధురై నుంచి తన యాత్రను ప్రారంభించారు. మధురై నుంచి దిల్లీకి 21వేల కిలోమీటర్ల ప్రయాణంలో బుల్లెట్ రాణి ఆదివారం పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా బిహార్ చేరుకుని, సోమవారం సమస్తిపుర్ మీదుగా తదుపరి ప్రాంతానికి బయలుదేరారు. ఈ 65 రోజుల యాత్ర ఏప్రిల్ 18న దిల్లీలో ముగుస్తుంది.