Brother Dare For Sister Exam In HP :మూడున్నర గంటలపాటు కష్టపడి ఏకంగా 4 కి.మీల పొడవునా మోకాళ్ల లోతు కురిసిన మంచును తొలగించి తన సోదరిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చాడు ఓ యువకుడు. ఆమె 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాసేలా చేశాడు. ఎవరూ ఊహించని రీతిలో ఆ సోదరుడు చేసిన ఈ సాహస ఘటన హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది.
స్కూళ్లు బంద్- కానీ
హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. భారీ మంచు కారణంగా ప్రధాన రహదారులన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. దీంతో విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అయితే ప్రస్తుతం హిమాచల్లో ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో మంచులోనే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఇది పెద్ద సవాలుగా మారింది.
సోదరుడి కష్టం కెమెరాలో నిక్షిప్తం
ఖంగ్‌సర్ గ్రామానికి చెందిన రిషిక గొంధా అనే యువతి మంగళవారం 12వ తరగతి బోర్డ్ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కు వెళ్లాల్సిన ప్రధాన రహదారి మొత్తం మంచుతో మూసుకుపోయింది. ఇది గమనించిన రిషిక గొంధా సోదరుడు పవన్ తన సోదరిని తన వెనకాల ఉండాల్సిందిగా కోరాడు. తాను ఆమె ముందు ఉండి మోకాళ్ల లోతు పేరుకున్న మంచును అతికష్టం మీద తొలగించుకుంటూ తన సోదరికి బాట వేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కిలోమీటర్ల ప్రధాన రహదారి పొడవునా పేరుకుపోయిన మంచును 3:30 గంటలపాటు కష్టపడి క్లియర్ చేశాడు. దీంతో ఆ సోదరి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకుని పొలిటికల్ సైన్స్ పరీక్ష రాసింది. ఇలా సోదరి కోసం సోదరుడు పడ్డ కష్టాన్ని ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది.