తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు బ్రిటన్‌ రాజ దంపతులు - మూడు రోజుల సీక్రెట్ ట్రిప్ ఎందుకంటే? - BRITAIN KING INDIA TRIP

భారత్​కు వచ్చిన బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3 దంపతులు - బెంగళూరుకు మూడు రోజుల సీక్రెట్ ట్రిప్

Britain King Charles India Trip
Britain King Charles India Trip (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 1:21 PM IST

Britain King Charles India Trip: బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3, ఆయన సతీమణి క్వీన్‌ కెమిల్లా భారత్‌లో సీక్రెట్‌ ట్రిప్‌కు వచ్చినట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో అక్టోబర్ 27 నుంచి ఉన్నట్లుగా పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఓ వెల్‌నెస్‌ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే బుధవారమే బెంగళూరు నుంచి బ్రిటన్​కు బయలుదేరనున్నట్లు సమాచారం. బ్రిటన్‌ రాజదంపతులు వెల్‌నెస్‌ కేంద్రంలో యోగా, మెడిటేషన్‌ సాధనలో సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది.

మీడియా కథనాల ప్రకారం కింగ్ చార్లెస్-3 దంపతులు అక్టోబర్ 21- 26 మధ్య కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు రహస్యంగా వచ్చారు. సీక్రెట్‌ ట్రిప్‌ కావడం వల్ల ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించలేదు. బెంగళూరులోని వెల్‌నెస్‌ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బంది వారికి వివిధ థెరపీ సెషన్‌లు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వెల్​నెస్​ సెంటర్​కు పలుమార్లు
2022లో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత ఛార్లెస్‌ను బ్రిటన్‌కు రాజుగా ప్రకటించారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్​కు రావడం ఇదే మొదటిసారి. అయితే ఆయన వేల్స్ యువరాజుగా ఉన్న సమయంలో చాలా సార్లు బెంగళూరులోని వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చేవారు. తన 71వ పుట్టిన రోజును కూడా అక్కడే ఘనంగా జరుపుకున్నారు.

తొమ్మిది సార్లు చికిత్స
బెంగళూరులోని సమేతనహళ్లిలో ఉన్న సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్​లోని బ్రిటన్ రాజ దంపతులు చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ఇస్సాక్ మథాయ్ డాక్టర్ సుజా ఇస్సాక్ దీనిని స్థాపించారు. ఇందులో ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుప్రెషర్, యోగా, హోమియోపతి, ఇతర సంప్రదాయ చికిత్సలు చేస్తారు. మూడో ఛార్లెస్‌ ఈ వెల్‌నెస్‌ సెంటర్‌కు తొమ్మిదిసార్లు వచ్చి చికిత్స చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details