Black Tomato Cultivation In Bihar :సాధారణంగా టమాటాలు ఏ రంగులో ఉంటాయో అందరికీ తెలుసు. కానీ బిహార్లోని గయాకు చెందిన ఓ రైతు మాత్రం నల్ల టమాటాలను పండిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ నల్ల టమాటాలను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఆయన నల్ల బంగాళదుంపలు, నల్ల అల్లం కూడా పండిస్తున్నారు.
అయితే నల్ల టమాటాల కోసం 22-25 మొక్కలు నాటానని, కేవలం 10-12 మొక్కలు మాత్రమే జీవం పోసుకున్నాయని రైతు ఆశిశ్ కుమార్ సింగ్ తెలిపారు. విపరీతమైన చలి కారణంగా మిగతా మొక్కలు మొలకెత్తలేదని చెప్పారు. ప్రస్తుతం టమాటాలు చిన్నగా ఉన్నాయని, పూర్తిగా పండిన తర్వాత నల్లగా మారుతాయని పేర్కొన్నారు రైతు. ఫైవ్ స్టార్ హోటళ్లలో బ్లాక్ టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, సలాడ్ కోసం ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారని చెప్పారు.
"ఎరుపు టమాటా కన్నా నల్ల టమాటాలో ఆంథోసైనిన్ స్థాయి చాలా ఎక్కువ. కొన్ని వ్యాధులు నయం కావడానికి బ్లాక్ టమాటాలు సహకరిస్తాయి. వైద్యానికి సంబంధించిన ఓ కథనం చదవడం వల్ల నాకు ఈ నల్ల టమాటాలను పండించాలన్న ఆలోచన వచ్చింది. అమెజాన్లో విత్తనాలను ఆర్డర్ చేసి బ్లాక్ టమాటాలను సాగు చేయడం ప్రారంభించాను"
- ఆశిశ్ కుమార్ సింగ్, రైతు
పోషక గుణాలు ఎక్కువ!
నల్ల టమాటాల్లో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయని మగధ్ యూనివర్సిటీ బోటన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ కుమార్ సింగ్ చెప్పారు. రెడ్ టామాటాల కంటే బ్లాక్ టమాటాల్లో ఆంథోసైనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. నల్ల టమాటాను మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడ్డ వారు తింటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.