BJP Lok Sabha MP Candidates List :త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకముందే లోక్‌సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 100 మందితో జాబితాను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఫిబ్రవరి 29న భేటీ కానుంది. అదే రోజు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలుపొందిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి గెలుపొందిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి అక్కడినుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఒంటిరిగానే 370 సీట్లు సాధించాలని బీజేపీ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఎన్డీయే కూటమి 400 సీట్లలో విజయం సాధించేలా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.