BJP Changes In Uttar Pradesh 2024 :ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తర్‌ప్రదేశ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62ఎంపీలు గెలుపొందిన కమలం పార్టీ ఈసారి 33 సీట్లకే పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ గణనీయంగా లబ్ధి పొందింది. యూపీలో చేదు ఫలితాల కారణంగా లోక్‌సభలో మెజార్టీకి అవసరమైన 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను BJP చేరుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ, సొంతంగా సాధారణ మెజార్టీ సాధించలేకపోయింది. భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎంపీ సీట్లకు భారీగా గండిపడిన నేపథ్యంలో BJP రాష్ట్ర శాఖలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కర్ని దిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నట్లు సమాచారం. యూపీ BJP రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేందర్ చౌదరీ, ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అంతకంటేముందు ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, BJP అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ అయ్యారు. దీంతో యూపీ BJP శాఖలో భారీ మార్పులు జరగవచ్చన్న ప్రచారం మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోదీతో యూపీ BJP రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేందర్ చౌదరీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావటం వల్ల నైతిక బాధ్యతగా పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి పుంజుకోవటానికి, 2027లో జరిగే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావటానికి పార్టీ పగ్గాలు ఓబీసీకి అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాట్ సామాజిక వర్గానికి చెందిన భూపేందర్ చౌదరీ బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. యూపీ జనాభాలో బీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఓబీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించటం ద్వారా ఆ వర్గాన్ని ఆకర్షించాలని దిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు తగ్గిన నేపథ్యంలో యూపీలో నాయకత్వ మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2022లోనూ జాట్ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే లక్ష్యంతోనే భూపేంద్ర చౌదరీకి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు యోగి సర్కార్‌లో ఇంటిపోరు కొనసాగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతోనే బీజేపీ అధినాయకత్వం యూపీ యూనిట్‌లో సమూల మార్పులకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. యోగి ప్రభుత్వంలో అంతర్గత పోరు కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శించారు. ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు తెలుసని, కుర్చీలాటతో వారు విసిగిపోయారని దుయ్యబట్టారు. అయితే ఎస్పీ అధినేత విమర్శలను ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య తిప్పికొట్టారు