BJP CEC Meeting In Delhi :లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం రాత్రి సమావేశమైంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే పార్టీ తరపున పోటీచేసే అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలని బీజేపీ భావిస్తోంది. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సైతం పరిగణనలోకి తీసుకొని 2019లో పార్టీ విజయం సాధించలేకపోయిన స్థానాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్థానాల పేర్లను తొలి జాబితాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వని భూపేందర్ యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ సహా పలువురు కేంద్ర మంత్రులను ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ చూస్తోంది.
ఫస్ట్ లిస్ట్‌లో మోదీ, షా
మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా చర్చించారు. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నేతలతో ఇప్పటికే ఇలాంటి భేటీలు జరిగాయి. అయితే లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.