తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో సుపరిపాలన గెలిచిందన్న మోదీ- కేజ్రీవాల్​పై అన్నాహజారే షాకింగ్ కామెంట్స్ - DELHI RESULTS 2025 REACTIONS

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పార్టీల అగ్రనేతలు

Delhi Results 2025 Reactions
Delhi Results 2025 Reactions (ETV Bharat, ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 4:10 PM IST

Delhi Results 2025 Reactions :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీల నేతలు స్పందించారు. చారిత్రక విజయాన్నందించిన దిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసా వహిస్తామంటూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటమిని అంగీకరించారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ సైతం స్పందించింది.

'దిల్లీ అభివృద్ధి మా గ్యారంటీ'
దిల్లీలో అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. 'దిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టిన దిల్లీ సోదరీమణులకు తల వంచి నమస్కరిస్తున్నా. దిల్లీని సమగ్రంగా అభివృద్ధిని చేయడానికి, ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము ఏ అవకాశాన్నీ వదులుకోమని హామీ ఇస్తున్నాం. దిల్లీ అభివృద్ధి మా గ్యారంటీ. దిల్లీవాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు దిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకితభావంతో ముందుకు సాగుతాం' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

'దిల్లీ ప్రజలు ఓటుతో బదులిచ్చారు'
దిల్లీలో అబద్ధాల పాలన ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అబద్ధాలు, మోసం, అవినీతి, శీష్‌మహల్‌ను నాశనం చేయడం ద్వారా దిల్లీని ప్రజలు ఆప్‌ రహితంగా మార్చారని వ్యాఖ్యానించారు. పదేపదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదారి పట్టించలేరని దిల్లీ వాసులు నిరూపించారని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. యమునా నది కాలుష్యం, అపరిశుభ్ర తాగునీరు, దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, నిత్యం తెరిచే ఉంచే మద్యం షాపులపై దిల్లీ ప్రజలు తమ ఓటుతో స్పందించారని షా ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఓటమిని అంగీకరించిన ఆప్​
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దిల్లీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు. పదేళ్లలో దిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ఫలితాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు.

'విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ రంగాలతపాటు వివిధ మార్గాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మేం ప్రయత్నించాం. దిల్లీలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేశాం. ప్రజలు తీసుకున్న నిర్ణయం ఆధారంగా మేము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడమే కాకుండా ప్రజల మధ్యనే ఉండి వారికి సేవ చేస్తూనే ఉంటాము. వారి కష్టసుఖాల్లో తోడుంటాం' అని కేజ్రీవాల్ తెలిపారు.

ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని దిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీసింగ్‌ అన్నారు. దిల్లీలో ఓటమి తమ పార్టీకి ఎదురుదెబ్బ అన్న ఆతిశీ-- బీజేపీ నిరంకుశత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆప్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుదని తెలిపారు.

మద్యం విధానం వల్లే ఓటమి
మద్యం విధానం కారణంగా కేజ్రీవాల్ ప్రతిష్ఠ దెబ్బతిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. మద్యం దుకాణాలను ప్రోత్సహించి, ప్రజల అవసరాలను గుర్తించడంలో ఆప్ అధినేత విఫలమయ్యారని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం గురించి మాట్లాడి మద్యం కుంభకోణంలో కూరుకుపోవడాన్ని ప్రజలు గమనించారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని పక్కనబెట్టి తప్పుడు మార్గంలో ప్రయాణించడం కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ చేసిన మరో తప్పిదమని అన్నా హజారే వ్యాఖ్యానించారు. డబ్బే ప్రధానంగా మద్యం విధానాన్ని తీసుకురావడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని అన్నారు.

మార్పు కోసమే ఓటేశారన్న కాంగ్రెస్
అరవింద్ కేజ్రీవాల్‌, ఆ పార్టీపై ఉన్న ప్రజాభిప్రాయమే దిల్లీ ఎన్నికల ఫలితాలు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రస్తుత పాలనతో దిల్లీ ప్రజలు విసిగిపోయారని, దీంతో మార్పునకు ఓటేశారని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ, వారు మరింత కష్టపడాలని కోరారు. దిల్లీ ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ ఫలితాలను- ప్రధాని మోదీ విధానాలకు సమర్థించినట్టు కాకుండా, కేజ్రీవాల్ మోసపూరిత రాజకీయాలను తిరస్కరించినట్టుగా చూడాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. కేజ్రీవాల్ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలను కాంగ్రెస్ కూడా ఎత్తిచూపిందని గుర్తు చేశారు.

'ఉమ్మడిగా ఉంటే బీజేపీకి ఓటమే'
ఆప్​, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేదని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఈ ఫలితాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. బీజేపీ దూకుడుకు ఆప్​ చాలా సీట్లు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details