Bengal Train Accident Kavach :బంగాల్ దార్జిలింగ్‌లో రైలు దుర్ఘటనకు కారణం సిగ్నల్ జంపింగేనని ప్రాథమికంగా నిర్ధరణ అయింది. గూడ్స్ ట్రైన్ డ్రైవర్‌ది ఎలాంటి తప్పులేదని కూడా తెలిసింది. కానీ కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. నిజానికి వచ్చే ఏడాదిలోపు దిల్లీ గువాహటి రైల్వేట్రాకుపై కవచ్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. వచ్చే ఏడాదిలోగా 6వేల కిలోమీటర్ల మేర కవచ్‌ను ఏర్పాటు చేయాలనుకున్న భారతీయ రైల్వే ప్రణాళికలో దిల్లీ -గువాహటి రైలు మార్గం కూడా ఉంది. బంగాల్ వ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 3వేల కిలోమీటర్ల మేర ట్రాక్‌లు కవచ్ పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కవచ్ రక్షణ శాఖ లేదని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఢీకొట్టే ప్రమాదం ఉన్నా!
రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO రూపొందించిన రక్షణ వ్యవస్థే కవచ్. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపినప్పుడు అంటే సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ సమయంలో ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. నిర్దేశించిన వేగం కన్నా రైలును లోకో పైలట్ నడుపుతున్నా లేదా, మరో లోకోమోటివ్‌ను ఢీకొట్టే ప్రమాదం ఉన్నా కవచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ లోకో పైలట్‌ను అప్రమత్తం చేసి, బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది.
అత్యవసర సందేశం పంపి!
అదే లైన్‌లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే ఆటోమెటిక్‌గా బ్రేక్‌లు వేసి ఆపేస్తుంది. ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తిచేస్తుంది. దట్టమైన పొగమంచు ఆవరించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైలు సాఫీగా, భద్రంగా నడవడానికి కవచ్ సాయపడుతుంది. ఇందుకోసం క్యాబిన్‌లో సిగ్నల్‌ను ప్రదర్శిస్తుంది. రైలు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు చేరువవుతున్నప్పుడు ఈ వ్యవస్థ తనంతట తానుగా అప్రమత్తం చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని రైళ్లకు అత్యవసర సందేశం పంపి, వాటిని అప్రమత్తం చేస్తుంది.
అంత తేలికైన పని కాదు!
కవచ్ అమర్చడం అంత తేలికైన పని కాదు. స్టేషన్లలో సెన్సార్లు, లోకోమోటివ్‌లు, ట్రాక్ వెంబడి రైల్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లు, టవర్లు, సమాచారాన్ని చేరవేసేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ముందుగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గరిష్ఠ రైలు వేగం గంటకు 130 కిలోమీటర్లతో నడుస్తుండటం వల్ల ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో రైళ్ల వేగం పెరిగి, మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనుండటం వల్ల ప్రమాదాల నివారణకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు 1465 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు, 139 లోకో మోటివ్‌లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం లక్ష కిలోమీటర్లకు పైగా పొడవైన ట్రాకులతో ఏర్పాటైంది. భవిష్యత్‌లో 34వేల కిలోమీటర్ల మేర కవచ్‌ను విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.