Bengal Governor Molestation Case: బంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రాజ్‌భవన్‌లోని ముగ్గురు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత హరే స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ముగ్గురు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న ఉద్దేశంతో ఈనెల 2న బాధితురాలు రాజ్‌భవన్ నుంచి బయటకు రాకుండా వారు అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గవర్నర్ సీవీ ఆనందబోస్ తనను లైంగిక వేధింపులకు గురించినట్లు రాజ్‌భవన్‌లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆరోపించారు. 361 ఆర్టికల్ ప్రకారం పదవిలో ఉన్న గవర్నర్‌పై నేర విచారణ చేపట్టడానికి వీలుండదు.
ఇదీ జరిగింది!
ఇటీవల బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.