Beggar Pappu Bihar Billionaire : బిహార్ పట్నాకు చెందిన ఓ బిచ్చగాడు యాచించిన సొమ్ముతోనే కోటీశ్వరుడిగా మారాడు. నగరంలో అనేక చోట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో తన ఇద్దరి పిల్లలను చదవిస్తున్నాడు. సొంతింట్లోనే ఉంటూ తన యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈటీవీ భారత్‌తో మాట్లాడిన బిచ్చగాడు పప్పు, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి లేదు. సరిగ్గా చదవకపోవడం వల్ల కుటుంబసభ్యులు నన్ను కొట్టేవారు. దీంతో ఒక్కసారి కోపం తెచ్చుకుని ముంబయి వెళ్లిపోయాను. చాలా రోజులపాటు అక్కడే ఉన్నాను. ఓసారి రైలులో ప్రయాణిస్తుండగా చేతికి గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చేరాను. నా వద్ద ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోయాయి. దీంతో మళ్లీ పట్నా వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాను. అయితే రైల్వే స్టేషన్లో నిల్చున్న నన్ను చూసి బిచ్చగాడిగా భావించి ప్రజలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నాకేం అర్థం లేదు. రెండు గంటల్లోనే చేతికి రూ.3,400 వచ్చింది. మరుసటి రోజు అదే స్థలానికి వెళ్లి కూర్చున్నా. మళ్లీ సంపాదించాను. అదే అలవాటుగా మారింది. ఆ తర్వాత పట్నాకు తిరిగి వచ్చి హనుమాన్ ఆలయంతోపాటు రైల్వే స్టేషన్ ఆవరణలో భిక్షాటన చేయడం ప్రారంభించాను"
--పప్పు, బిచ్చగాడు
'ఐదు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి'
తనకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పప్పు తెలిపాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు ఉన్నట్లు చెప్పారు. తన భార్యకు ఐసీసీసీఐ, కోఆపరేటివ్ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నట్లు పేర్కొన్నాడు. డబ్బుతో పాటు నగరంలో చాలా చోట్ల భూమి ఉందని, కుటుంబం మొత్తం నివసించే ఇల్లు కూడా ఉందని తెలిపాడు. ఇదంతా భిక్షాటన చేసిన సొమ్ముతోనే కొనుగోలు చేశానని పేర్కొన్నాడు.
"నా ఇద్దరి పిల్లలు పట్నాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. నేను చదవుకోకపోయినా వారి లక్ష్యాలను వారు చేరుకోవాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాను. యాచించిన సొమ్ముతోనే నా పిల్లలను అధికారులుగా తీర్చుదిద్దుతాను. నేను రోజుకు రూ.400కుపైగా సంపాదిస్తాను. నెలవారీ సంపాదనను బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తాను" అని పప్పు చెప్పాడు.
పట్నాలో భిక్షాటన చేసి పప్పు కోటీశ్వరుడయ్యాడని అతడి స్నేహితుడు మరో బిచ్చగాడు విశాల్ తెలిపాడు. "మేం కూడా భిక్షాటన చేసి కోటీశ్వరులయ్యాం. అయితే డబ్బంతా వృథా చేసుకున్నాం. పప్పు అంటే బిచ్చగాళ్లకు గౌరవం. అతడిని కరోడ్‌పతి పప్పు అని అంతా పిలుస్తారు. అతడే మాకు నాయకుడు. భిక్షాటనను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ పప్పు మాత్రం భిక్షాటనతోనే కోటీశ్వరడయ్యాడు" అని విశాల్ చెప్పాడు.
ఈటీవీ భారత్‌తో మాట్లాడుతున్న బిలియనీర్ పప్పు