తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెంగళూరులో నీటి సమస్య తీవ్రం- ఫేస్ వాష్ కోసం వెట్‌ వైప్స్- అలా చేయకపోతే రూ.5వేల ఫైన్! - water crisis in bangalore

Bangalore Water Crisis : బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. ఎండాకాలం పూర్తిగా రాకముందే ప్రజలు మంచి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు ఇంకిపోవడం వల్ల నల్లానీరు రాక అవస్థలు పడుతున్నారు. బిందెలు చేత పట్టుకుని వాటర్‌ ట్యాంకర్‌ల కోసం నిరీక్షిస్తున్నారు. కొన్ని ఎన్‌క్లేవ్స్​లో స్విమ్మింగ్‌ పూల్‌ కార్యకలాపాలు, వాహనాల వాషింగ్‌పై నిషేధం విధించారు. నీటి దుర్వినియోగం చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

Bangalore Water Crisis
Bangalore Water Crisis

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 6:54 PM IST

Bangalore Water Crisis : కర్ణాటక రాజధాని బెంగళూరులో మంచి నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రిజర్వాయర్లలో నీరు లేక నల్లాల ద్వారా నీటి సరఫరా చాలా చోట్ల నిలిచిపోయింది. అపార్ట్‌మెంట్‌ వాసులు నీటి కోసం ఎక్కువ డబ్బు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్‌లను ఆశ్రయిస్తున్నారు. అలా కూడా నీరు దొరకడం కష్టంగా మారినట్లు తెలిసింది. మంచి నీటి సరఫరాపై BWSSB అధికారులు ఎప్పటికప్పుడు నగరవాసులకు సమాచారం ఇస్తున్నారు.

ఫేస్ వాష్ కోసం వెట్‌ వైప్స్!
నగరంలోని చాలా నివాస సముదాయాల్లో మంచి నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టుకుంటున్నారు. వాహనాలను శుభ్రం చేయడం, స్విమ్మింగ్‌ పూల్‌ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని ప్రెస్టీజ్‌ ఫాల్కన్‌ సిటీ ఎన్‌క్లేవ్‌లో నివాసితులు చేతులు, ముఖం కడుక్కోవడానికి వెట్‌ వైప్స్‌ను వాడుకోవాలని సూచనలు జారీ చేశారు. పరిస్థితి మరింత దిగజారితే ఇళ్లలో స్టీల్‌ పాత్రలకు బదులుగా వాడి పడవేసే డిస్పోజల్‌ స్పూన్లు, పాత్రలను తెచ్చుకోవాల్సి ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తున్నారు.

అలా చేయకుంటే రూ.5వేల ఫైన్​!
Bangalore Water Problem : వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీలో నీటి దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు భద్రతా సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ బోర్‌లలో నీరు వస్తున్నా అది ఏ క్షణమైనా నిలిచిపోతుందన్న భయంతో నీటి వినియోగాన్ని 20 శాతానికి తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే 5 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

నీటి సరఫరా చేయాలని ఆదేశాలు
అయితే బెంగళూరులోని నీటి సమస్యపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. నగరంలోని నీటి డిమాండ్‌ను తీర్చడానికి కాంగ్రెస్‌ సర్కారు తీవ్రంగా యత్నిస్తోందని తెలిపారు. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.

మా ఇంట్లో కూడా నీరు లేవ్​!
బెంగళూరుకు రామనగర, హోస్‌కోట్‌, చన్నపట్న, మాగాడి పట్టణాల నుంచి ట్యాంకర్లను తెప్పిస్తున్నట్లు డీకే శివకుమార్​ పేర్కొన్నారు. నగరానికి నీరందించే మేకేదాటు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తన ఇంట్లో కూడా బోరుబావి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డీకే.

వేసవి తంటా.. నీళ్ల కోసం భయానక రీతిలో బావిలోకి దిగుతున్న మహిళలు

ఆ సమస్య తీరేవరకు నో హనీమూన్.. వాటర్ ట్యాంకర్​పై వధూవరుల ఊరేగింపు

ABOUT THE AUTHOR

...view details