Ayodhya Things To Know Before Visiting :ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రెండు వారాల్లో 30 లక్షల మందికి పైగా ప్రజలు సందర్శించారు. సగటున రోజుకు 2-2.5 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు.
భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలక్‌రామ్ మందిరంలో స్వామివారి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు కొన్నిరోజలు క్రితం పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. మరి అయోధ్య వెళ్లేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏమింటంటే?
1. జర్నీ
ఇండిగో, ఎయిర్ఇండియా, స్పైస్ జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, జయపుర, పట్నా వంటి వివిధ నగరాల నుంచి అయోధ్యకు రోజువారీ విమానాలను నడుపుతున్నాయి. దిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో కూడా వెళ్లవచ్చు.
2. వసతి
అయోధ్యలో గదుల కొరత ఉన్నందున ముందుగానే హోటల్ గదిని బుక్ చేసుకోండి. ధర్మశాలను కూడా ఎంచుకుని బస చేయవచ్చు. లేకుంటే హోలీ అయోధ్య యాప్ డౌన్లోడ్ చేసుకుని హోమ్‌స్టేలను బుక్ చేసుకోవచ్చు. ఇక అయోధ్య స్టేషన్లో రైల్వే శాఖ డార్మిటరీ నిర్మిస్తోంది.