Ayodhya Ram Mandir Construction Status :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానున్నాయి. డిసెంబరులోగా రామమందిరం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గర్భగుడిలో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ పనుల్లో వేగాన్ని పెంచేందుకు గాను ఎల్ అండ్ టీ, టాటా, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయి. డిసెంబరు నాటికి ఆలయ పనులను పూర్తి చేస్తామని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు.
వేలాది మంది కార్మికులతో!
రామ మందిర నిర్మాణ సమయంలో కింద అంతస్తులో ఏర్పాటు చేసిన స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు 200 మంది కళాకారులను నియమించారు. మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగతా మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు దాదాపు 1200 మంది కార్మికులను నియమించారు. ఇక ఆలయ భద్రత కోసం 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రదక్షిణ మార్గం, మరో ఆరు దేవతలకు ఆలయాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులను ఇంతకుముందు వరకు 2000 మంది కూలీలు చేసేవారు. త్వరలోనే వీరి సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థలకు ఆలయ నిర్మాణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.