Ayodhya Ram Jewellery : అయోధ్యలో ఇటీవలే రామయ్య ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఆ సమయంలో బాలరాముడు దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు అద్భుతంగా దర్శనం ఇచ్చాడు. అయితే, ఈక్రమంలోనే రామయ్య ఒంటిపై ఉన్న నగలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. మరి రామయ్య ఒంటిపై ఎన్ని కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయో తెలుసుకుందామా.
Ram Lalla Jewellery :రామ్‌లల్లా ఒంటిపై 15కిలోల బంగారం, 18వేల పచ్చలు(మరకతమణులు), వజ్రాలు ఉన్నాయట. బాలరాముడికి తిలకం, కిరీటం, నాలుగు హారాలు, నడుము పట్టి, రెండు జతల చీలమండలు, విజయమాల, రెండు ఉంగరాలు సహా మొత్తం 14 ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాల తయారీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన హర్షహైమల్ శ్యామ్‌లాల్ జ్యువెల్లరీకి రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు 15రోజుల ముందు అప్పగించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే కేవలం 12 రోజుల్లోనే రామయ్య ఆభరణాలు తయారుచేసింది జ్యువెల్లరీ సంస్థ.
బాలరాముడికి ఆహార్యానికి తగ్గట్టుగా కిరీటాన్ని రూపొందించారు తయారీదారులు. అలాగే 16 గ్రాముల బంగారంతో రామయ్య నుదిటిపై తిలకాన్ని తీర్చిదిద్దారు. 65 గ్రాముల బరువున్న మరకతమణి ఉంగరాన్ని అందంగా తయారుచేశారు. ఈ ఆభరణాలు రామయ్య దివ్య సౌందర్యాన్ని మరింత పెంచాయి.
రామయ్యకు విరాళాలు
మరోవైపు రాములోరికి విరాళాలు అందించిన వారిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి మొదటిస్థానంలో ఉన్నారు. సుమారు 101 కిలోల బంగారాన్ని అయోధ్య రామమందిరానికి ఆయన కుటుంబం భూరి విరాళం ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ.68 వేల ఉంది. అలా చూసుకుంటే దిలీప్ కుటుంబం రామమందిరానికి రూ.68 కోట్లు కానుకగా ఇచ్చినట్టు అవుతుంది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.