Sitaram Yechury Body Donated To AIIMS :ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌కు అప్పగించారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, దిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయం నుంచి ఏచూరి అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో వేలాది మంది కామ్రేడ్లు, రాజకీయ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన సోనియా, జైరాం రమేశ్
అంతకుముందు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని వసంత్ కుంజ్‌లోని ఆయన నివాసం నుంచి సీపీఐ కార్యాలయానికి తరలించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, జైరాం రమేశ్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా ఏచూరి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. అలాగే పలువురు సీపీఎం నాయకులు సైతం తమ అభిమాన నేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారం ఏచూరి మృతి జాతీయ రాజకీయాల్లో పెద్ద శూన్యతను సృష్టించిందని కేరళ మంత్రి పీ. రాజీవ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
నివాళులర్పించిన నడ్డా
అలాగే శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిద్దరి ఆలోచనలు వేరేనా, ఏచూరితో తనకు మంచి సంబంధాలున్నట్లు నడ్డా ఎక్స్‌లో పోస్టు చేశారు. తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు జీవితమంతా కృషి చేశారని పేర్కొన్నారు. ఏచూరికి భగవంతుడు శాశ్వత శాంతిని ఇవ్వాలని, ఈ బాధను తట్టుకునే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని జేపీ నడ్డా ఆకాంక్షించారు.
న్యూమోనియాతో ఎయిమ్స్‌లో మృతి
కాగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) సెప్టెంబరు 12న కన్నుమూశారు. న్యూమోనియాతో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు సీతారాం ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనతికాలంలోని దిగ్గజ నాయకుడిగా ఎదుగుదల
చెన్నైలో 1952 ఆగస్టు 12న సీతారాం ఏచూరి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందినవారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత చదువుల కోసం దిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత జేఎన్ యూలో ఎంఏ ఆర్థికశాస్త్రం పూర్తిచేశారు. అక్కడే పీహెచ్ డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని సీతారాం ఏచూరి అరెస్టయ్యారు. 1974లో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. ఆ తర్వాతి అనతికాలంలోని ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి 1984లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. 1992లో జరిగిన సీపీఎం పార్టీ మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005-17 మధ్య 12 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
వ్యక్తిగత జీవితం
సీతారాం ఏచూరి ఇంద్రాణి మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. వారికి అశీష్ ఏచూరి, అఖిల ఏచూరి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశీష్ ఏచూరి 2021లో కొవిడ్ కారణంగా మరణించారు. అఖిల యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్, యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్‌లో ఆచార్యురాలుగా పనిచేస్తున్నారు. సీతారాం ఏచూరి సీమా చిస్తీ అనే జర్నలిస్టును రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్‌గా ఉన్నారు.
సీతారాం ఏచూరి కన్నుమూత- రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్ సంతాపం - Sitaram Yechury Passed Away
స్టూడెంట్ లీడర్ నుంచి జాతీయ స్థాయి నేతగా- సీతారాం ఏచూరి ప్రస్థానం - Sitaram Yechury Biography