Arvind Kejriwal On BJP :దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతాపార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, దిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలకు ఎర వేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమ్‌ఆద్మీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ముట్టజెబుతామని బీజేపీ ఆశచూపిందని ఆరోపించారు. వారందరికీ బీజేపీ నుంచి టికెట్లు కూడా ఇస్తామని నచ్చజెప్పారని తెలిపారు.
ప్రభుత్వాన్ని పడగొడతామని ఎమ్మెల్యేలకు బెదిరింపులు
అంతేకాక తనను త్వరలోనే అరెస్టు చేయిస్తామనీ తద్వారా ప్రభుత్వాన్ని పడగొడతామని ఎమ్మెల్యేలను బెదిరించినట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని వెల్లడించారు. దిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పలు కుట్రలు పన్నిందని, అయితే అవన్నీ విఫలమయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఖండించిన బీజేపీ
మరోవైపు, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. తాము రూ.25 కోట్లు ఇస్తామన్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని ఆప్‌నకు సవాల్ విసిరింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దిల్లీ బీజేపీ సెక్రటరీ హరీశ్ ఖురానా మండిపడ్డారు.