Arvind Kejriwal Bail :మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన ఆయనకు ఆప్ పార్టీ నేతలు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జైలు నుంచి బయటకు కారులో వెళ్తూ ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వారికి అభివాదం చేస్తూ ప్రసంగించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్ తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. వాహనంలో ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. మరోవైపు ఆయన విడుదల నేపథ్యంలో తిహాడ్ జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
హనుమాన్ వల్లే బయటకు వచ్చా!
"హనుమాన్ దయ వల్లే బయటకు వచ్చాను. శనివారం ఉదయం 11గంటలకు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తా. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు. వారి వల్లే ఈరోజు మీ ముందుకొచ్చాను. నన్ను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నా శక్తిమేరకు పోరాడతాను. కానీ, 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలి. శనివారం మధ్యాహ్నం 1గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తాం" అని కేజ్రీవాల్ చెప్పారు.
అంతకుముందు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.
కేజ్రీవాల్‌కు జూన్ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్ నిబంధనలను కేజ్రీవాల్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సీఎం కార్యాలయానికి గానీ, దిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని ఆదేశించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది.
"ప్రతి కేసులోని వాస్తవాల ఆధారంగా మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అందుకు మినహాయింపు కాదు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సంపూర్ణ, స్వేచ్ఛావాద దృక్పథాన్ని సమర్థిస్తూ బెయిల్ ఇచ్చాం. కేజ్రీవాల్‌కు ఎలాంటి నేర చరిత్రలు లేవు. సమాజానికి ఆయన ప్రమాదకరం కాదు. కేజ్రీవాల్ ఈ కేసులో ఇంకా దోషిగా నిర్ధరణ కాలేదు" అంటూ బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.