Amritpal Singh Mother Arrested :ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అసోంలోని దిబ్రూగఢ్ నుంచి పంజాబ్ జైలుకు అమృత్‌పాల్‌ను తరలించాలని డిమాండ్ చేస్తున్న ఆమెను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్‌పాల్‌తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీ (చేత్నా మార్చ్) చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పాటు అమృత్‌పాల్ మామ, మరికొంతమందిని ఆదివారం అమృత్‌సర్‌లో అరెస్టు చేశారు.
'అమృత్‌పాల్ తల్లి బల్వీందర్ కౌర్‌ను జ్యుడిషియల్ కస్టడీకి పంపాం. ఇది కేవలం ముందస్తు అరెస్టు మాత్రమే. బల్వీందర్‌తో పాటు సుఖ్‌చైన్ సింగ్, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం' అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆలం విజయ్ సింగ్ తెలిపారు. కాగా, అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఆయన నిరాకరించారు.
'పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణం'
అమృత్‌పాల్, అతడి మద్దతుదారులకు సంబంధించి జైలు మార్పునకు మద్దతుగా అతడి తల్లితోపాటు ఇతర ఖైదీల కుటుంబీకులు, బంధువులు మార్చి 8న చేత్నా మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బఠిండాలోని దామ్‌దామా సాహిబ్ అకల్ తఖ్త్ సాహిబ్‌కు చెందిన జాతేదార్ నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుండగా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని అమృత్‌పాల్ సింగ్ తండ్రి మీడియాతో తెలిపారు. పోలీసుల చర్యను తప్పుబడుతూ శిరోమణి అకాలీదళ్ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఖరిని ఖండించింది.