తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారందరికీ ఇదే వార్నింగ్- 2026 మార్చి 31తో దేశంలో నక్సలిజం మాయం!' - Amit Shah on Naxalism

Amit Shah on Naxalism : దేశంలోని నక్సల్స్ అందరూ హింసను, ఆయుధాలను విడిచి పెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వారిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రతినబూనారు.

Amit Shah on Naxalism
Amit Shah on Naxalism (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 11:47 AM IST

Amit Shah on Naxalism : హింసను విడనాడాలని, ఆయుధాలను విడిచి పెట్టి లొంగిపోవాలని దేశంలోని నక్సలైట్లందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పిలుపునిచ్చారు. లేకపోతే పూర్తి స్థాయిలో నక్సల్ నిర్మూలన ఆపరేషన్​ను నిర్వహిస్తామని హెచ్చరించారు. నక్సలికజానికి వీడ్కోలు పలికేందుకు 2026 మార్చి 31 తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్​గఢ్ నక్సల్స్ బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.

'దేశంలో నక్సల్‌ హింస, సిద్ధాంతాలను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్​గఢ్​లోని కేవలం నాలుగు జిల్లాకే పరిమితమైంది. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయి. నేపాల్​లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్​ గతంలో నిర్ణయించారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసింది. ఛత్తీస్​గఢ్​లో నక్సల్​ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం' అని అమిత్​ షా భరోసా ఇచ్చారు.

'వారి నుంచి మా ప్రాంతానికి విముక్తి కల్పించాలి'
ఛత్తీస్​గఢ్​లోని 55 మంది నక్సల్ బాధితులు తమకు న్యాయం చేయాలని గురువారం దిల్లీలోని జంతర్​మంతర్ వద్ద ప్రదర్శనలు చేశారు. 'బస్తర్ శాంతి సమితి' పేరుతో ర్యాలీని నిర్వహించారు. నక్సల్​ ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ మైన్స్ వల్ల ప్రాణాలను కోల్పోతున్నామని, వారి నుంచి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు సురక్షితంగా లేరని, ఒంటరిగా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. బాలికలకు సరైన విద్య కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అమిత్​ షా శుక్రవారం నక్సల్​ బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని హింసను విడిచిపెట్టాలని నక్సల్స్ అందరికి వార్నింగ్ ఇచ్చారు. వారికి ఓ సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details