Amit Shah On Modi :2029 వరకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన తమను నడిపిస్తారని చెప్పారు. ఇది దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బ్యాడ్ న్యూస్ వంటిదని అన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో ఇచ్చిన తీర్పు సాధారణమైనది కాదని తెలిపారు. ఇప్పుడు ఆయన మరో కేసులో ఇరుక్కుపోయారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీ ఓటు బ్యాంకుకు భయపడి!
మైనారిటీ ఓటు బ్యాంకుకు భయపడి ఘమండియా(పొగరబోతు) కూటమి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను బహిష్కరించిందని ఆరోపించారు. "ఈద్ రోజు మీరు ముస్లిం సోదరులతో ఈద్ జరుపుకోవడానికి, ఖర్చు చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు హిందువులు అయినప్పటికీ రామమందిరప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాలేదు? ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందని అలా చేశారు. ఇది ఎలాంటి రాజకీయం?" అని అమిత్ షా ప్రశ్నించారు.
రాహుల్ చేసింది సరి కాదు!
దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని తెలిపారు అమిత్ షా. కానీ రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు తాను 2 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి ఉండాల్సిందని, ప్రజాస్వామ్య కోణంలో దాన్ని దాచిపెట్టడం సరికాదని అన్నారు. "వయనాడ్ ప్రజలకు మీరు ముందే చెప్పాల్సింది. ఆ తర్వాత వారిని ఎంపిక చేసుకోవాలని కోరాల్సింది. పోస్ట్ పోల్ సర్వేలో మీకు ముప్పు ఉందని తెలిసి రాయ్‌బరేలీకి వచ్చారు. అది సరైనది కాదు" అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా ఇంటర్వ్యూలోని మరికొన్ని ప్రశ్నలు- సమాధానాలు మీకోసం.
ప్రశ్న:మథురలో కృష్ణ జన్మభూమి, కాశీలో జ్ఞానవాపి స్థానంలో విశ్వనాథ ఆలయ నిర్మాణం, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి ఎన్డీఏకు 400 సీట్లు కావాలని అసోం సీఎం ఎందుకు అంటున్నారు?
అమిత్ షా:పీఓకే విషయానికొస్తే ఇది బీజేపీ నిబద్ధత మాత్రమే కాదు, దేశ పార్లమెంట్ నిబద్ధత కూడా. పీఓకే భారత్‌లో ఒక భాగం, దానిపై మనకు అధికారం ఉంది. దానిని ఎవరూ కాదనలేరు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. వారిని గౌరవించండి, పీఓకే డిమాండ్ చేయవద్దని ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లను నేను అడగాలనుకుంటున్నాను. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ అణుశక్తికి భయపడి తన హక్కును వదులుకుంటుందా? పాకిస్థాన్‌ను గౌరవించండంటూ ఇండి కూటమి నేతలు ఏం చెప్పదలుచుకున్నారో రాహుల్ బాబా దేశానికి వివరించాలి. పీఓకేను వదులుకోవాలా? అది ఎప్పటికీ జరగదు. పీఓకేలో నిర్వహణ లోపం ఉంది. మంచి పరిపాలన లేదు. అది వారి సబ్జెక్ట్ కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది ఎందుకంటే మొత్తం కశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయింది. ఆ హక్కును ఎలా తీసుకోవాలనేది భారత్ ముందున్న సవాల్.
ప్రశ్న:400 స్థానాలే లక్ష్యమని మీరు నినదిస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే ఈ నినాదం ఇచ్చారని విపక్షాలు అంటున్నాయి. ముస్లింల హక్కులు, ముస్లిం రిజర్వేషన్లు లాక్కొవడానికే బీజేపీ యత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి వాదన క్షేత్రస్థాయికి చేరింది.