Alien Temple In Tamilnadu :ఎక్కడైనా దేవుడికి గుడి కట్టటం చూస్తుంటాం. లేదంటే కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలకు దేవాలయాలు నిర్మించారని విని ఉంటాం. అలాగే అభిమాన నాయకులు, నటుల కోసం గుడి కట్టడం చూస్తుంటాం. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏలియన్స్( గ్రహాంతర వాసులు) కోసం దేవాలయం నిర్మించాడు. అసలేందుకు ఆయన ఇలా చేశాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
'గుడి నిర్మాణానికి ఏలియన్స్ నుంచి అనుమతి తీసుకున్నా'
సేలం జిల్లా మల్లమూపంబట్టికి చెందిన లోగనాథన్ ఏలియన్స్ గుడిని నిర్మించాడు. తాను ఏలియన్స్‌తో మాట్లాడి దేవాలయ నిర్మాణానికి అనుమతి తీసుకున్నానని చెప్పాడు. మూడు ఎకరాల భూమిలో ఆయన గుడి నిర్మాణం చేపట్టాడు. ఆలయంలో నేలకు 11 అడుగుల లోపల సెల్లార్లో శివుడు, పార్వతి, మురుగన్, కాళిమాత వంటి దేవతా విగ్రహాలు, ఏలియన్స్ ప్రతిమలను ప్రతిష్ఠించాడు.
'ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి ఏలియన్స్కే ఉంది'
ప్రపంచంలోనే గ్రహాంతరవాసుల కోసం తానే మొదటి ఆలయాన్ని నిర్మిస్తున్నానని లోగనాథన్ చెప్పాడు. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నానని 'ఈటీవీ భారత్'కు ఫోన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తన నమ్మకం ప్రకారం ఏలియన్స్ అంటే సినిమాల్లో లాగా ఉండవని, వాటికి కొమ్ములు వంటివి ఉండవని స్పష్టం చేశాడు. ఏలియన్స్‌ను ప్రత్యేకంగా ఎలా పూజించాలో వివరించాడు. అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నాడు. అలాగే ఏలియన్స్ అనుమతి తీసుకునే వాటి గుడి కడుతున్నానని చెప్పుకొచ్చాడు.