Air India Flight Emergency :ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక్కసారిగా తీవ్రఉత్కంఠకు గురిచేసింది. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు, వెంటనే తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తిరుచ్చి నుంచి శుక్రవారం బయల్దేరిన కొద్ది సమయానికే ఈ ఘటన జరిగింది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేయడం వల్ల, ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉండటం వల్ల అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే?
ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడం వల్ల అప్రమత్తమయ్యారు అధికారులు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు.
అయితే అత్యవసర పరిస్థితుల్లో విమానం సురక్షిత ల్యాండింగ్ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు పైలట్లు. దాదాపు రెండు గంటల పాటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ముందస్తు ఏర్పాట్లును సైతం చేశారు. 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక యంత్రాలతోపాటు పారామెడికల్ సిబ్బందిని ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంచారు. అయితే, ఎట్టకేలకు ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడం వల్ల ప్రయాణికులు, అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
కొన్ని గంటల పాటు గాల్లో చక్కర్లుకొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ కావడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. సేఫ్‌గా ల్యాండ్ అయిన వార్త విని ఎంతో సంతోషించానన్నారు. విమానం గాల్లో ఉండగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వార్తలు విన్న వెంటనే ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి వారితో సమన్వయం చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు, వైద్య సహాయంతో సహా అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్నవారందరినీ సురక్షితంగా చేర్చేందుకు తగిన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు పైలెట్, సిబ్బందికి అభినందనలు తెలిపారు.