ADR Report Third Phase Elections :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది. మూడో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగబోతోంది. ఇందులో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 95 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఆయా స్థానాల్లో మొత్తం 1,352మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 244 మంది (18 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో 172 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య కేసులు, 38 మందిపై మహిళలపై అత్యాచారం సహా నేరాలకు సంబంధించిన కేసులు, 17 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయి.
పార్టీలవారీగా లెక్క ఇదీ
మూడో విడత ఎన్నికల బరిలో బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల్లో 22 మందిపై, కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. బిహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో, అందరిపైనా కేసులు ఉన్నాయని పేర్కొంది. శివసేనకు(ఉద్ధవ్ వర్గం) చెందిన 80 శాతం మంది అభ్యర్థులపై, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కు చెందిన 67 శాతం మంది అభ్యర్థులపై, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 50 శాతం మంది అభ్యర్థులపై, జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన 33 శాతం మంది అభ్యర్థులపై, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 17 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. ఏదైనా లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం ముగ్గురిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా ఏడీఆర్ ప్రకటిస్తుంది. మూడో విడతలో 95 లోక్‌సభ స్థానాలకుగానూ 43 చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించడం గమనార్హం.
ఎంత మంది కోటీశ్వరులంటే?
మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతుల విషయానికొస్తే, 1,352 మంది అభ్యర్థులలో 392 మంది (29%) కోటీశ్వరులే. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 82 మంది అభ్యర్థుల్లో 77మంది (94 శాతం) కోటీశ్వరులే. కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థులలో 60 మంది (88%) కోటీశ్వరులు ఉన్నారు. జేడీయూ, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన (శిందే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థులంతా కోటీశ్వరులే కావడం గమనార్హం. మూడో విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. అత్యధికంగా బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.44.07 కోట్లుగా ఉంది. 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.20.59 కోట్లుగా ఉంది.