Actor Vijay Political Party : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పారు.
"ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం. పార్టీ జెండా, అజెండాను త్వరలో ప్రకటిస్తాం" అని విజయ్ వెల్లడించారు.
"తమిళ ప్రజలు నాకు చాలా ఇచ్చారు. నేను ఇప్పుడు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. మా నాన్న, అమ్మ, పేరు, ప్రఖ్యాతి, డబ్బుతో సహా అన్నీ నాకు అందించింది తమిళ ప్రజలే. అది వారికి తిరిగి ఇవ్వాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈసీలో పార్టీని నమోదు చేసేందుకు మా పార్టీ నేతలు దిల్లీకి వెళ్లారు. ఇక నేను సైన్ చేసిన సినిమాల్లో మరొకటి పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రయాణానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. తమిళనాడు ప్రజలకు నేను అంకితం" అని విజయ్ తెలిపారు.