Teacher Took Students On Trip By Plane :పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. కొంతమంది పిల్లలను విమానంలో విహరయాత్రకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ టూర్ కోసం అయిన ఖర్చును సొంతంగా భరించారు. అసలు ఈ టీచర్ ఎవరు, ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక బెళగావి మండలంలోని సొనట్టి ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ పాఠశాలలో ప్రకాశ్ దెయన్నవర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు పట్ల సరైన అవగాహన లేదని, దాని గురించి స్థానికులు ఎక్కువగా పట్టించుకోవడం లేదని గుర్తించారు. అందుకే పాఠశాలల్లో పిల్లల హాజరు సంఖ్య తక్కువగా ఉందని తెలుసుకున్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చి, పాఠశాలకు పిల్లలు రెగ్యులర్‌గా వచ్చేలా చేయాలని అనుకున్నారు ప్రకాశ్. అనుకున్నదే తడవుగా ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టారు. స్కూల్‌కు క్రమం తప్పకుండా వచ్చిన వారిని విమానంలో విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటన చేశారు.
ప్రకాశ్ ఆలోచన పనిచేయడం మొదలు పెట్టింది. ఆయన చేసిన ప్రకటనతో విద్యార్థుల్లో విమానంలో విహరించాలనే తపన ఏర్పడింది. క్రమంగా పిల్లల హాజరు శాతం కూడా పెరిగింది. దీంతో మాట ఇచ్చినట్టుగా ఏడాది తర్వాత పాఠశాలకు రెగ్యులర్‌గా వచ్చిన 17 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారందరినీ గురువారం(నవంబర్ 7న) బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు ప్రకాశ్. విమానాశ్రయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆనందంగా వీడ్కోలు పలికారు.
విద్యార్థులంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌ను సందర్శిస్తారు. ఇక్కడ ప్రముఖ పర్యటక ప్రాంతాలైన రామోజీ ఫిల్మ్‌సిటీ, చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం తదితర ప్రాంతాలను చూస్తారు.
సొంత ఖర్చుతో!
ఈ విహారయాత్రకు సంబంధించి మొత్తం దాదాపు రూ.2.5లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. అందులో రూ.2లక్షల వరకు ప్రకాశ్ దెయన్నవర భరిస్తున్నారు. మిగతా మొత్తం కోసం రూ.3 వేల చొప్పున పిల్లల నుంచి వసూలు చేశారు.