తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​న్యూస్​- ఉద్యోగుల కోసం 8వ పే కమిషన్​ ఏర్పాటు- శ్రీహరికోటలో కొత్త లాంచ్​ప్యాడ్ నిర్మాణం - 8TH PAY COMMISSION

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు- ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు 8వ పే కమిషన్​ ఏర్పాటుకు ఆమోదం- శ్రీహరికోటలో మూడో లాంచ్​ప్యాడ్ నిర్మాణానికి పచ్చజెండా

8th Pay Commission Approval
Union Minister Ashwini Vaishnaw (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 3:22 PM IST

Updated : Jan 16, 2025, 3:51 PM IST

8th Pay Commission Approval :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

"1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటు అయ్యాయి. జాప్యానికి తావులేకుండా వేతన సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటు అయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్తుంది. ఆ గడువుకన్నా ముందే, 2025లోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం ద్వారా సరిపడా సమయం దొరుకుతుంది. 7వ పే కమిషన్ గడువు ముగియడానికి ముందే వేతనాల పెంపుపై సిఫార్సుల పొందేందుకు వీలు కలుగుతుంది. కొత్త కమిషన్​కు ఛైర్మన్​, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తాం" అని కేంద్ర మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని- ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.

ఇస్రోకు మరింత శక్తి
ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం-షార్​లో మూడో లాంచ్​ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం రూ.3,985కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్​ లాంచ్ వెహికిల్-ఎన్​జీఎల్​వీ ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్​ప్యాడ్​ నిర్మాణాన్ని రోదసీ పరిశోధన రంగానికి అవసరమయ్యే మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక మైలురాయిగా అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం- భారత్ త్వరలో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు షార్​లో కొత్తగా నిర్మించబోయే లాంచ్​ప్యాడ్​ ఉపకరించనుంది. ఎన్​జీఎల్​వీ ప్రయోగాలు మాత్రమే కాక- సెమీక్రయోజనిక్ స్టేజ్​తో కూడిన ఎల్​వీఎమ్​3 ప్రయోగాలకూ వేదిక కానుంది. నాలుగేళ్లలో మూడో లాంచ్​ప్యాడ్​ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Last Updated : Jan 16, 2025, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details