Chhattisgarh Encounter :ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మరి కొంత మందికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది.
మావోయిస్టులను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు, వెంటనే లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ మావోయిస్టులు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశాయి.
రూ.1కోటి రివార్డ్ నక్సల్ చలపతి హతం
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులోని జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అనేక మంది మావోయిస్టులు మంగళవారం హతమయ్యారు. వీరిలో రూ.1కోటి రివార్డ్ నక్సల్ చలపతి కూడా ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జనవరి 19 రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్ CoBRA, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.