Indian Railways 1000 New General Coaches : అతి తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం దొరుకుతందని ప్రజలు రైల్వే ప్రయాణానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ గత కొద్ది కాలంగా సీట్ల కొరత, రిజర్వేషన్‌కు భారీగా వెయిటింగ్ ఉండడం వల్ల చాలా మంది రైల్వే ప్రయాణానికి దూరమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు రైల్వే శాఖ ఓ శుభవార్త వినిపించింది. ఇకపై ప్రయాణికులకు జనరల్ బోగీలో సీట్ల కొరతను తగ్గించే దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
1000 కొత్త బోగీలు - దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోన్న రైళ్లకు కొత్త జనరల్ బోగీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంది రైల్వే శాఖ. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని రైల్వే బోర్డు తెలిపింది.
ఈ బోగీల ద్వారా ప్రతీ రోజు అదనంగా లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని వెల్లడించింది. పలు రైళ్లకు ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను అమర్చినట్లు తెలిపిన రైల్వే శాఖ, మిగతా రైళ్లకు కూడా వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది.