'కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకే ఈటలను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారు'
🎬 Watch Now: Feature Video
Telangana BJP Elections Campaign 2023 : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకే అప్పుడు ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బయటకు పంపించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్ తరఫున ఆయన సతీమణి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, కనుకులగిద్ద గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికి.. మంగళహారతులు పట్టారు. ర్యాలీగా గ్రామంలో తిరుగుతూ.. ఓటర్లను ఆమె కలిశారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చిందా అని ఈటల జమున ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒక్కరినే ఓడగొట్టడం కాదని.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు రాష్ట్రమంతటా ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ప్రార్థించారు.