Oil Tanker accident in Hyderabad : హైదరాబాద్‌లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
🎬 Watch Now: Feature Video
Oil Tanker Overturned in Hyderabad : నిత్య జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరని పెద్దల వాదన. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్‌లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. మాసబ్‌ట్యాంక్ ఎన్‌ఎండీసీ వద్ద తెల్లవారుజామున గేర్ ఆయిల్‌ను తరలిస్తున్న ఓ లారీ పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో వాటిలోని ఆయిల్ రోడ్డు పైన ధారలుగా పారింది.
ఈ ఘటనతో వాహనాలరాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు మెహిదీపట్నం నుంచి మాసబ్‌ట్యాంక్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌తో వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు ఆయిల్ ట్యాంకర్లను తొలగించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు స్థానికులు అంచనా వేస్తున్నారు.