400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు.. పాదయాత్రకు పయనమైన నారా లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Nara Lokesh for Yuvagalam Padayatra: రాష్ట్రంలోని యువత సమస్యల ప్రక్షళానానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. యువగళం పేరిట 400 రోజులు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు.. ఇంటివద్ద ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆశీర్వాదాలిచ్చి పంపారు.
తెలుగుదేశం యువ నేత నారా లోకేశ్ పాదయాత్రకు బయలుదేరి వెళ్లేముందు.. తన భార్య, కుమారుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. తొలుత వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఏడాదికిపైగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమైన లోకేశ్.. కుమారుడు దేవాన్ష్‌ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. భార్య నారా బ్రాహ్మణి బొట్టు పెట్టి సాగనంపారు.
లోకేశ్ వాహనం ఎక్కేటప్పుడు తల్లి భువనేశ్వరి వెంట నడవగా.. తండ్రి చంద్రబాబు ఆయనకు ఎదురొచ్చారు. అత్తామామలు నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవిల ఆశీర్వాదంతో పాటు.. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి దంపతులు, ఇతర కుటుంబీకుల ఆశీర్వాదం లోకేశ్ తీసుకున్నారు. నందమూరి, నారా కుటుంబసభ్యుల ఆత్మీయతల మధ్య లోకేశ్.. తన తాత ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఆయన సమాధివద్దకు బయలుదేరి వెళ్లారు. లోకేశ్ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.