'కేసీఆర్కు ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న భయం పట్టుకుంది' - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 9:16 PM IST
|Updated : Nov 7, 2023, 3:03 PM IST
Komatireddy Venkat Reddy Comments on KCR : బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ.. చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న పార్టీలు గెలిచి మోదీకి సపోర్ట్ చేసి.. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారనీ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ గద్దె దిగే సమయం దగ్గరపడిందని.. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.
జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో అక్కడి డీ గ్రేడ్ స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ఆక్షేపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆయన.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి జెండా ఎగరబోతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు.