ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచె తొలగింపు - నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి - ప్రగతిభవన్ ముందున్న ఇనుప కంచె తొలగించిన అధికారులు
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 8:56 AM IST
Officials Removed Iron Fence in front of Pragati Bhavan : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెను బద్దలుకొట్టి ప్రజా భవన్‌గా మార్చుతామన్న రేవంత్ రెడ్డి వాగ్దానానికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. బేగంపేట్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ప్రగతిభవన్ వద్ద రహదారిపై ఉన్న కంచెను కార్మికుల సహాయంతో తొలగించి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రగతిభవన్‌ను నిర్మించి అందులోకి అడుగుపెట్టారు. అయితే అక్కడ ఆందోళనలు జరిగిన ప్రతిసారీ కంచె ఎత్తును పెంచారు.
నేడు సీఎం ప్రజా దర్బార్: ఆ విధంగా క్రమంగా నాలుగు అడుగుల నుంచి 15 అడుగుల వరకు పెంచారు. కంచె చుట్టూ ముళ్ల తీగను అమర్చారు. రోడ్డువైపు కంచెను విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓసారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ముళ్ల కంచె ఎక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ముళ్ల కంచెను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే జీహెచ్ఎంసీ, రహదారులు-భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి ఇనుప కంచెను తొలిగించారు. నేడు ఈ ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.