Hyderabad Rains Traffic : హైదరాబాద్- విజయవాడ హైవే వైపు వెళ్తున్నారా.. అయితే రూట్ మార్చాల్సిందే - హైదరాబాద్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Hyderabad Vijayawada Highway Traffic : హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై భారీ వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచాయి. రాత్రి నుంచి లారీ చోదకులు పడిగాపులు కాస్తున్నారు. దారి మళ్లించడంతో విజయవాడ దూరం కావడంతో చేసేదేంలేక రహదారి పక్కకు వాహనాలను నిలిపివేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీలోని నందిగామ సమీపంలో ఐతవరం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై నుంచి మున్నేరు వాగు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కోదాడ వద్ద హుజూర్ నగర్, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ చేరేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మున్నేరు వాగు వరద ఉద్ధృతి తగ్గే వరకు మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా రూట్ మ్యాప్‌ను పోలీసులు ప్రయాణికులకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సీఐ రాము పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని.. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంకేమైనా సమాచారం కావాలంటే టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 040-69440000, 040-23450033 ఈ నంబర్లకు సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.