ఆకాశాన్ని తాకేలా అంబేడ్కర్ విగ్రహం.. అంగరంగ వైభవంగా ఆవిష్కరణ వేడుక
Ambedkar statue Inauguration in Hyderabad : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా స్వరాష్ట్రం సిద్ధించుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అందుకు ఏడేళ్ల క్రితమే బీజం పడినా అనివార్య కారణాల వల్ల అది కాస్త అలస్యం అయింది. అయినా, సకల హంగులతో దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఎట్టకేలకు రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు రూపొందిన ప్రణాళిక ఆధారంగానే ఇది సాధ్యమైందని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దళితులు సహా అన్ని వర్గాల వారికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి కొప్పుల అన్నారు. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున సీఎం కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వెల్లడించారు. అదే ప్రాగంణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50వేల జనం వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆకాశాన్ని తాకేలా.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.