ప్రతి సంవత్సరం మార్చి నెల రెండో గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినంగా జరుపుకుంటాం. శరీరంలోని మూత్రపిండాల ప్రాముఖ్యం, అనుబంధ వ్యాధులు, వాటిని కాపాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించటమే ఈ రోజు ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి 11న "మూత్రపిండాల వ్యాధి ఉన్నప్పటికీ సంతోషంగా జీవించడం ఎలా" అనే అంశానికి ప్రాముఖ్యమిస్తున్నాం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (ఐఎస్ఎన్), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ (ఐఎఫ్కేఎఫ్) సంయుక్తంగా 2006 లో మొదటిసారిగా ప్రారంభించి ఈ అవగాహనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.
లాన్సెట్ వైద్య పత్రిక ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2017 లో ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల (సీకేడీ)తో బాధపడుతున్న రోగులు 69 కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. వారిలో 12 లక్షల మంది మరణించారు. సీకేడీ ఉన్న రోగులలో దాదాపు మూడోవంతు మంది చైనా, భారత్లో నివసించేవారే ఉండటం విస్మయానికి గురి చేసే అంశం.
ఈనాటి లక్ష్యాలు:
ప్రపంచ మూత్రపిండాల దినం ప్రధాన లక్ష్యాలను వారి అధికారిక వెబ్‌సైట్ ఈ విధంగా తెలియజేస్తోంది.
- దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి మధుమేహం, అధిక రక్తపోటు ముఖ్య కారణాలని తెలిపింది.
- సీకేడీ కోసం డయాబెటిస్, రక్తపోటు ఉన్న రోగులందరినీ క్రమపద్ధతిలో పరీక్షించాలి. వాటి నివారణా మార్గాలను తెలియజేయాలి.
- మూత్రపిండాల వ్యాధుల పరిశీలనలో వైద్యులకు వారి పాత్రను, ప్రాధాన్యాన్ని వివరించాలి.
- స్థానిక, జాతీయ ప్రభుత్వాలు, వాటి ఆరోగ్య విభాగాలు చేయాల్సిన పనులను నొక్కి చెప్పాలి. ఈ రోజున ప్రభుత్వాలు ఈ వ్యాధులు ఉన్న వారిని గుర్తించే కార్యక్రమాలను చేపట్టాలి.
- మూత్రపిండాల మార్పిడి దీనికి చక్కని పరిష్కారం కాబట్టి... అవయవ దానాన్ని ప్రోత్సహించాలి.
మూత్రపిండాలు ఏం చేస్తాయి?
శరీరంలో తయారైన విసర్జించదగిన విషపదార్ధాలను రక్తం నుంచి విడగొట్టి మూత్రం ద్వారా బయటకు పంపడమే కాకుండా, అదనంగా ఉన్న ద్రవాన్ని విసర్జించి రక్తపీడనాన్ని సవ్యంగా ఉండేటట్టు చేస్తాయి. ఎర్ర రక్త కణాలు జనించటానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి. వీటిలో తయారయ్యే ఉత్తేజకాలు (హార్మోన్స్) శరీర క్రియలను సక్రమంగా నిర్వహిస్తాయి.
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి:
సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటే.. కిడ్నీలు దెబ్బతిని రక్తాన్ని పూర్తి స్థాయిలో వడగట్టలేవు. ఇందువల్ల శరీరంలోనే నిలిచిపోయిన కొన్ని ప్రమాదకర రసాయనాలు గుండెపోటు లాంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
- రక్తహీనత (తక్కువ ఎర్ర రక్త కణాలు)
- ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి
- రక్తంలో క్యాల్షియం స్థాయి తగ్గి పొటాషియం, ఫాస్ఫరస్ నిల్వలు పెరుగుతాయి.
- ఆకలి తగ్గడం
- మనోవ్యాకులత, నిరాశ
వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ లక్షణాలు మరింత పెరుగుతాయి. సకాలంలో చికిత్స అందించకపోతే మూత్రపిండాలు అచేతనమై గుండె రక్తనాళాల సమస్యకు దారితీస్తుంది. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే డయాలసిస్ కానీ, మూత్రపిండ మార్పిడి కానీ చేయాల్సి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవాళ్లు అంతిమంగా డయాలసిస్ స్థాయికి చేరతారు.
5 ప్రధాన ముప్పులు:
- మధుమేహం
- అధిక రక్తపోటు
- గుండె జబ్బు
- మూత్రపిండాల వ్యాధి వంశపారంపర్యత
- ఊబకాయం
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచండిలా:
"అధిక మోతాదులో నొప్పి మాత్రలు, ఇతర ఔషధాలు వాడకం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధ ఔషధాలను, ఆయుర్వేద సాంప్రదాయక ఔషధాలను వాడాలి. కింద సూచించిన 9 అమూల్య సూత్రాలను పాటించి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి." అని చెబుతున్నారు డా. ఎల్.హెచ్ హీరా నందిని ఆస్పత్రి ప్రధాన అధికారి సుజిత్ ఛటర్జీ.
- రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ
- శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం
- శరీర బరువును నియంత్రించుకోవటం
- అధిక మోతాదులో మద్యపానం మంచిదికాదు
- ధూమపానం మానడం
- తరచూ రక్తపోటును పరీక్షించుకోవటం
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం
- క్రమం తప్పని శారీరక వ్యాయామం
- తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం