Retinoblastoma Symptoms: చిన్నారులు సుకుమారులు. వాళ్లకేం జరిగినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. లోకం తెలియని పసిపాపల కంట్లోని నల్లగుడ్డుపై తెల్లపొర వస్తే అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కంట్లో పువ్వు కనిపించినా, కంట్లో నల్లగుడ్డుపై మెరుపులా వచ్చినా ఆలస్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. ఈ తెల్లపొర వెనక రెటినోబ్లాస్టోమా క్యాన్సర్ కారణమై ఉండొచ్చని ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్ అక్కినేని వీణ పేర్కొన్నారు.
రెటినోబ్లాస్టోమా అంటే..!
ఇది కంటికి సంబంధించిన క్యాన్సర్. కంటి వెనక భాగంలో ఉండే రెటీనాకు వస్తుంది. చిన్న పిల్లల్లోనే ఎక్కువగా రానుంది. పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల వరకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే 40 శాతం చిన్న పిల్లలకూ ఇది వస్తుంది.
లక్షణాలు ఇవీ
- నల్లని గుడ్డుపై తెల్లని మెరుపుగానీ, తెల్లగా పువ్వు గానీ ఉంటుంది.
- కొంతమందికి మెల్ల కన్ను వస్తుంది. ఒక కన్ను కుడి, ఎడమ వైపునకు వెళ్లిపోతుంది.
- కన్ను ఉబ్బిపోయి ఎర్రగా మారి చూపు తగ్గిపోతే వెంటనే పిడియాట్రిక్ అంకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
- కంటిలో వచ్చే క్యాన్సర్ చిన్నగా ఉండి పెద్దగా అయితే కంటి చూపు పోతుంది.
- అది కంటి నుంచి మెదడుకు విస్తరించడం, శరీరానికి విస్తరించే అవకాశమూ ఉంటుంది. చివరికి ప్రాణాంతకంగా మారొచ్చు.
- ఈ వ్యాధి నిర్థారణకు కంటి పరీక్ష, ఎంఆర్‌ఐ చేస్తే చాలు.
చికిత్స ఎలా ఉంటుంది..
Retinoblastoma Treatment: దీనికి నాలుగు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లోకల్ థెరపీ, సర్జరీ, సిస్టమిక్ థెరపీ, రేడియేషన్ థెరపీలను అవసరం మేరకు చేస్తాం. కొన్నిసార్లు ప్రాణాలు కాపాడేందుకు కన్ను కూడా తీసేయాల్సి వస్తుంది.
ఇవీ చదవండి:అర్ధరాత్రి దాటినా నిద్ర రావటం లేదా, అయితే ఇలా చేయండి