Heart Patients Statin Treatment : గుండెజబ్బు ముప్పు అధికంగా గలవారికి, అప్పటికే గుండెజబ్బులతో బాధపడేవారికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లు సిఫారసు చేస్తుంటారు. వీటిని డాక్టర్లు సూచించినంత కాలం వాడుకోవాలని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ అధ్యయనం సూచిస్తోంది. మధ్యలో మానేస్తే గుండె జబ్బుల నుంచి లభించే రక్షణ తగ్గిపోతోందని చెబుతోంది. గుండెజబ్బుకు ప్రధాన కారణం రక్తంలో అధిక కొలెస్ట్రాల్. చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్) స్టాటిన్లతో 1 ఎంఎంఓఎల్/లీ మేరకు తగ్గించుకున్నా గుండెపోటు, పక్షవాతం ముప్పు 25% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే ఈ మందులను ఆలస్యంగా మొదలు పెట్టటమో, మధ్యలో మానెయ్యటమో చేస్తుంటారు. స్టాటిన్ల వాడకంతో తలెత్తే దుష్ప్రభావాలను అతిగా ఊహించుకోవటమూ దీనికి దోహదం చేస్తోంది. స్టాటిన్లను ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎంతకాలం కొనసాగించాలి? అనే దానిపైనా కొంత అనిశ్చితి ఉంది.
ఈ నేపథ్యంలో స్టాటిన్లను ఆరంభించి నప్పట్నుంచి ఎంత మేరకు ప్రయోజనం లభిస్తోందనేది తాజా అధ్యయనంలో అంచనా వేశారు. జబ్బులతో బాధపడకుండా హాయిగా జీవించే కాలం ఆధారంగా వీటి ప్రయోజనాన్ని లెక్కించారు. గుండెజబ్బు ముప్పు ఎక్కువగా గలవారికి స్టాటిన్లతో మరింత ఎక్కువగానూ, త్వరగానూ ఫలితం కనిపిస్తున్నట్టు తేలింది. జీవితాంతం స్టాటిన్లు వాడుకున్నవారితో పోలిస్తే- యాబైల్లో ఆరంభించి 80ల్లో ఆపేసినవారికి వీటి ప్రయోజనం 73% వరకు తుడిచి పెట్టుకు పోతుండటం గమనార్హం.
మగవారికన్నా మహిళలకు గుండెజబ్బు ముప్పు తక్కువ. అంటే వీరికి స్టాటిన్లతో జీవితాంత ప్రయోజనం మలి వయసులోనే చేకూరుతోందన్నమాట. ముందే ఆపేస్తే మగవారి కన్నా ఎక్కువ ప్రమాదకకరంగా పరిణమిస్తోంది. 45 ఏళ్ల కన్నా తక్కువ వయసు గలవారిలో- వచ్చే పదేళ్లలో గుండెజబ్బు ముప్పు 5% కన్నా తక్కువగా ఉన్నవారు స్టాటిన్లను కాస్త ఆలస్యంగా ఆరంభించినా పెద్ద ఇబ్బందేమీ ఉండటం లేదు. అదే గుండెజబ్బు ముప్పు 20% కన్నా ఎక్కువ గలవారికైతే హాయిగా జీవించే కాలం 7% వరకు తగ్గుతోంది. గుండెజబ్బు ముప్పు ఎక్కువగా గలవారికి స్టాటిన్ల మేలు ముందుగానే మొదలవు తోందని ఇది సూచిస్తోంది. ఈ చికిత్స ఆలస్యమైతే ప్రయోజనమూ ఎక్కువగానే తగ్గిపోతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ప్రొటీన్‌తో మధుమేహానికి చెక్.. రోజుకు ఎన్ని గ్రాములు తీసుకోవాలంటే?