Walking Mistakes : ఆరోగ్యకరమైన జీవన విధానంలో ప్రతీ ఒక్కరికీ నడక చాలా అవసరం అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంతమంది వాకింగ్ విషయంలో చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. వాకింగ్‌లో ఎటువంటి టెక్నిక్స్ పాటించడం వల్ల మంచి ఫలితాలుంటాయి? వాకింగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు గురించి నిపుణులేమంటున్నారో ఆ వివరాలు మీ కోసం.
నడిచేటప్పుడు ఇవి చేయొద్దు
పాదరక్షలు : సరైన పాదరక్షలు వాడకపోవడం వల్ల అసౌకర్యాన్ని, నొప్పిని కూడా కలిగిస్తాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. మీరు వాకింగ్‌లో ధరించే షూస్ విషయంలో సౌకర్యవంతమైనవి మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. లేదంటే కాలికి బొబ్బలు, పాదాల నొప్పుల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
'నిటారుగా నడవండి'
నడక సమయంలో నిటారుగా నడవాలని ఫిట్నెస్ కోచ్‌లు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ శ్వాస మెరుగుపడటంమే కాకుండా.. వెన్ను సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వారు అంటున్నారు. తద్వారా మీరు నడక వలన ఎన్నో లాభాలు పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మొబైల్ చూస్తూ నడవద్దు
నడక సమయంలో కొంత మంది మొబైల్ వైపు చూస్తూ వాకింగ్ చేస్తుంటారు. దీనివల్ల మీ మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా మెడనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. అందువల్ల మీరు నడుస్తున్నపుడు నిటారుగా వెళ్లండి.
కోఆర్డినేటెడ్ ఆర్మ్ స్వింగ్
మీరు వాకింగ్‌కు వెళ్లినపుడు కోఆర్డినేటెడ్ ఆర్మ్స్వింగ్ పద్ధతిలో నడవడం ఉత్తమం. నడుస్తున్నపుడు మీ చేతులను కాళ్లకు వ్యతిరేఖ దిశలో కదిలించండి. ఈ విధానంలో నడవడం వల్ల మీ వాకింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా మీరు ఒక బ్యాలెన్స్‌గా ముందుకు వెళ్లేందుకు ఈ కోఆర్డినేటెడ్ ఆర్మ్స్వింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది.
తగినంత నీరు తీసుకొండి
వాకింగ్ చేస్తున్నపుడు వేగంగా శరీరంలోని నీరు డీ హైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు తగినంత మంచినీరు తీసుకోవాలి. లేకపోతే కండరాలలో అలసట వచ్చి మీరు ఎక్కువ దూరం నడవలేరు. అందువల్ల డీ హైడ్రేషన్ కాకుండా మీరు వాకింగ్‌కు వెళ్లేటప్పుడు మీతో పాటు మంచినీళ్లు తీసుకెళ్లడం మంచిదని ఫిట్నెస్ కోచ్‌లు సూచిస్తున్నారు.
సరిగా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
గాయాలు నివారణ
మీరు సరైన విధంగా నడవడం వల్ల కిందకు పడకుండా ఉండటమే కాకుండా జారిపడకుండా ఉంటారని నిపుణులు అంటున్నారు. తద్వారా శరీరానికి ఎటువంటి గాయాలు కాకుండా నివారించవచ్చని తెలిపారు. మీరు సరిగా నడిస్తే మీ శరీరం బ్యాలెన్స్‌గా ఉంటుంది.
కీళ్ల సంరక్షణ
సరైన విధంగా వాకింగ్ (నడుస్తున్నపుడు) చేస్తున్నప్పుడు శరీరంలోని అన్ని కీళ్లపై సమానమైన ఒత్తిడి ఉంటుందని నిపుణులు తెలిపారు. అందువల్ల మీ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిపై అధిక ప్రభావాన్ని నివారించవచ్చు. ఫలితంగా ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మడమ(చీలమండ) రక్షణ
మీరు వాకింగ్ చేస్తున్నపుడు ఫుట్ స్టెప్‌పై శ్రద్ధ చూపడం, సరిగా నడవడం సమర్థవంతంగా నడవడంలో అతిముఖ్యం. ఫలితంగా మడమ నొప్పి లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది. సరైన నడక మడమ మెలితిప్పడాన్ని నిరోధిస్తుందని ఫిట్నెస్ నిపుణులంటున్నారు.
'వెన్నెముక సమస్యలకు చెక్ పెట్టవచ్చు'
సరైన భంగిమలో నడవడం వల్ల మీ వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతందని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఫలితంగా వెన్నెముకకు వచ్చే సమస్యలనుంచి మీకు ఉపశమనం కల్పిస్తుందని చెబుతున్నారు. వీటితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
ఫొటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్
సరైన రీతిలో వాకింగ్ చేయడం వల్ల ఫొటెల్లో ఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ అనే వ్యాధి నుంచి బయటపడవచ్చని నిపుణులంటున్నారు. మోకాలి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుందని.. దీంతో పాటు ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండేట్లుగా చూసుకోవచ్చని చెబుతున్నారు. సరిగా నడవడం వల్ల పైన వివరించిన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు వివరించారు. ఈ విధమైన అలవాట్లు మీ ఆరోగ్యకరమైన జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.