తిన్న ఆహారం సరిగా జీర్ణంకాక కడుపుబ్బరం, తేన్పులతో బాధపడుతున్నారా? అయితే వజ్రాసనం(Vajrasana Benefits) వేయడం సాధన చేయండి. అతి ముఖ్యమైన యోగాసనాల్లో ఇదొకటి. ఇది మలద్వారం, జననాంగాలకు మధ్య ఉండే వజ్రనాడిని ప్రభావితం చేస్తుంది. కాబట్టే దీనికి వజ్రాసనం(Vajrasana Benefits) అని పేరు. భోజనం చేసిన తర్వాత వేసే ఆసనం ఇదొక్కటే.
ఎలా చేయాలి?
రెండు కాళ్లను తిన్నగా చాచి కూర్చోవాలి. ఒకదాని తర్వాత మరో కాలును మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి తీసుకురావాలి. పాదాలను పిరుదుల కిందికి తీసుకురావాలి. మడమలు ఎడంగా ఉంచుతూ.. బొటనవేళ్లు తాకేలా చూసుకోవాలి. అరచేతులను మోకాళ్ల మీద ఆనించి ఉంచాలి. శరీర బరువు పిరుదుల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. తల, వెన్నెముక నిటారుగా ఉంచాలి. కళ్లు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉండి తిరిగి మామూలు స్థితికి చేరుకోవాలి. కష్టంగా అనిపిస్తే ముందు ఒక పాదం మీద కూర్చోవటం సాధన చేయాలి. అనంతరం రెండు పాదాల మీద కూర్చోవాలి. వజ్రాసనం వేసేటప్పుడు ధ్యాసను శ్వాస మీద కేంద్రీకరించాలి. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు నొప్పి తగ్గేంతవరకు దీన్ని వేయకపోవటం మంచిది.
ప్రయోజనాలు
- తొడలు, మోకాళ్లు, పిక్కలను బలోపేతం చేస్తుంది.
- ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. భోజనం చేసిన 5-20 నిమిషాల తర్వాత వేస్తే ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, పులితేన్పులు, మొలలు, హెర్నియా నివారణకు తోడ్పడుతుంది.
- గర్భిణులకు కాన్పు తేలికగా అవటానికి దోహదం చేస్తుంది.
- వెన్నెముక కీళ్లు నాడులను నొక్కటం వల్ల వచ్చే సయాటికా నొప్పి తగ్గుముఖం పడుతుంది.