weight loss techniques: అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు మొదలుపెడితే.. మరికొందరు తమ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు.. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కొన్ని పదార్థాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
ప్రత్యామ్నాయాలు మంచివి!
అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటికి బదులుగా తక్కువ క్యాలరీలు, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చక్కెరలు, ఉప్పు తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువూ తగ్గచ్చు.
చల్లచల్లగా తాగాలనిపిస్తే..!
శీతల పానీయాల్లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ అధికంగా కలుపుతారు. ఇవి అధిక బరువుతో పాటు గుండె సమస్యలు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. వీటికి బదులు పచ్చి మామిడికాయలు, బెల్లం, ఉప్పు, జీలకర్ర, పుదీనా, యాలకులతో తయారుచేసిన ‘ఆమ్ పన్నా’ తీసుకుంటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలాగే శరీరానికి శక్తినిచ్చే ఖనిజలవణాల స్థాయులూ ఎక్కువవుతాయి. ఇక పచ్చిమామిడిలో ఉండే విటమిన్ ‘సి’ బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఐరన్ జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సాస్‌లకు బదులు..
చిప్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్.. వంటివి తినాలంటే వాటికి తోడు సాస్ ఉండాల్సిందే. అయితే ఈ సాస్‌లలో మోతాదుకు మించి చక్కెర, ఉప్పు కలుపుతుంటారు. వీటిలో అధిక క్యాలరీలు కూడా నిండి ఉంటాయి. ఇవి బరువును పెంచడమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. అందుకే వీటికి బదులు ఇంట్లో పులియబెట్టి తయారుచేసిన పచ్చళ్లను వాడడమే శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వీటిలోని మంచి బ్యాక్టీరియా పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ పచ్చళ్లలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువూ తగ్గచ్చు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా రోజుకు ఒకట్రెండు టీస్పూన్లు చాలంటున్నారు.
ఆ ఓట్స్ అయితే మంచివి!
ముడి ఓట్స్‌ని ప్రాసెస్ చేసే క్రమంలో ఎక్కువ మొత్తంలో చక్కెర, ఉప్పు, రసాయనాలు వాడతారు. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్యాలూ తలెత్తచ్చు. పైగా ఈ ప్రక్రియ వల్ల వీటిలోని పోషకాలు కూడా నశించిపోతాయి. కాబట్టి వీటికి బదులుగా స్టీల్ కట్ ఓట్స్ (ముడి ఓట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం) మంచివంటున్నారు నిపుణులు. పైగా వీటిని తక్కువగా ప్రాసెస్ చేయడంతో పాటు రసాయనాలు కూడా తక్కువగానే వినియోగిస్తారట! అందుకే బరువు తగ్గాలనుకునే వారు స్టీల్ కట్ ఓట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. తద్వారా ఇతర ఆహార పదార్థాల మీదకు మనసు మళ్లదు. అలాగే మధుమేహులకు ఇది మంచి ఆహారం కూడా!
బేకరీ ఐటమ్స్ వద్దు!
పేస్ట్రీలు, కేక్స్, కుకీస్.. వంటి బేకరీ పదార్థాల్లో చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్స్ (చెడు కొవ్వులు) అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అమాంతం పెంచుతాయి. అలాగే వీటిని అమితంగా తీసుకోవడం వల్ల బరువూ పెరుగుతాం. కాబట్టి వీటికి బదులుగా సొరకాయతో చేసిన వంటకాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలు, కొద్దిగా నెయ్యి కలిపి తయారుచేసిన సొరకాయ ఖీర్‌ను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. సొరకాయలోని ఫైబర్, పాలలోని ప్రొటీన్ అధిక బరువును నియంత్రణలో ఉంచుతాయట! పైగా ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థాలు కావడం వల్ల మధుమేహులు కూడా వీటిని తినచ్చు.
ఇంట్లో వెన్నే మంచిదట!
వివిధ రకాల ఆహార పదార్థాలకు చక్కటి రుచిని అందించడానికి మనం వెన్నను ఉపయోగిస్తాం. అయితే బయట మార్కెట్లో దొరికే వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్స్ (చెడు కొవ్వులు), సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం! దీనికి బదులు ఇంట్లోనే వెన్న తయారుచేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎక్కువ మోతాదులో అందుతాయి. అయితే ఇంట్లో తయారుచేసిన వెన్నను కూడా మితంగానే తీసుకోవాలి. అప్పుడే బరువు అదుపులో ఉంటుంది.
ఇదీ చూడండి: