ఆహారాన్ని బాగా నమిలి మింగడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. కొందరు చిన్నారులు ఆహారాన్ని నమలకుండా మింగేస్తూ ఉంటారు. అలాకాకుండా బాగా నమిలి తినాలని చెప్పాలి. ముఖ్యంగా పిల్లలకు అందించే స్నాక్స్ ఆరోగ్యకరమైనవే ఉండాలి. క్యారెట్, ఆపిల్, జామ, పైనాపిల్ వంటివాటికి ప్రాముఖ్యమివ్వాలి. వాటిని నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. దీంతో దంతాల మధ్యలో చేరుకునే వ్యర్థాలు తొలగిపోవడంతోపాటూ చిగుళ్లు కూడా శుభ్రపడతాయి.
- చాక్లెట్లు, దంతాలకు అంటుకుపోయి జిగురుగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే చిరుతిళ్లకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఇవి దంతాల మధ్యలో ఇరుక్కుని పలురకాల అనారోగ్యాలను కలిగిస్తాయి. అలాగే భోజనం లేదా స్నాక్స్ తిన్న తరువాత అర నిమిషంపాటు పుక్కిలించే అలవాటును చేయాలి.
- రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేయడం చిన్నప్పటి నుంచే అలవరచాలి. దైనందిన కార్యక్రమాల్లో దీన్ని ఓ భాగమయ్యేలా చేయాలి. అలా బ్రష్ చేసిన తరువాత ఏమీ తినకుండా చూడాలి. దంతాల పరిరక్షణ ఎంత ముఖ్యమో బొమ్మల ద్వారా పిల్లలకు అవగాహన కలిగించాలి. ఎనిమిదేళ్లు దాటేసరికి పాలపళ్లు ఊడిపోయి కొత్తగా పళ్లు వస్తున్న దశ ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఏటా కనీసం ఒక్కసారైనా దంతవైద్యుల పర్యవేక్షణ అవసరం అవుతుంది.
ఇదీ చూడండి:అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి